సంచలనంగా మారిన స్వీపర్ జీతం.. రాజమహేంద్రవరం స్వీపర్‌కు లక్షన్నర వేతనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంచలనంగా మారిన స్వీపర్ జీతం.. రాజమహేంద్రవరం స్వీపర్‌కు లక్షన్నర వేతనం!

  • వాట్సాప్‌లో వైరల్ అవుతున్న స్వీపర్ పే స్లిప్
  • విద్యుత్ శాఖలో సంస్కరణల ఫలితం
  • రూ.లక్షన్నర వేతనం అందుకుంటున్న వెంకటరమణమ్మ
అవును! రాజమహేంద్రవరానికి చెందిన స్వీపర్ కోల వెంకటరమణమ్మ వేతనం అక్షరాలా లక్షన్నర రూపాయలు. వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఆమె పే స్లిప్‌ను చూసి చాలామంది ఫేక్ అని కొట్టిపారేశారు. అయితే, అది ఫేక్ కాదని, ఆమె వేతనం రూ.1,47,722 అని తేలింది. ఆమె మాత్రమే కాదు.. ఆమెలా లక్షకుపైగా జీతం తీసుకుంటున్న వారు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు విద్యుత్ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పోయి జెన్‌కో, ట్రాన్స్‌ కోలు ఏర్పడ్డాయి. ట్రాన్స్‌ కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లు ఏర్పాటు చేశారు. సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వడాన్ని తొలగించారు. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు వారి వేతనాలను భారీగా పెంచారు. ఇంక్రిమెంట్ల విషయంలోనూ అంతే భారీ స్థాయిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్ని స్థాయిల ఉద్యోగులకు బ్రహ్మాండమైన వేతనాలు లభిస్తున్నాయి. సర్వీసు బాగా ఉన్న స్వీపర్, అటెండర్ల జీతం ఐదంకెలు దాటిందంటే వారి వేతనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్‌కో సీఎండీ కంటే 30 ఏళ్ల సర్వీస్ ఉన్న చీఫ్ ఇంజినీర్ వేతనమే ఎక్కువ.

ఇక, కోల వెంకటరమణమ్మ విషయానికి వస్తే ఆమె 1978లో 16వ ఏట విద్యుత్తు శాఖలో స్వీపర్‌గా చేరారు. 1 ఏప్రిల్ 1981లో ఆమె శాశ్వత ఉద్యోగిగా మారారు. రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని విద్యుత్‌ చౌర్య నిరోధక విభాగంలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. మరో నాలుగేళ్లలో రిటైర్ కాబోతున్న ఆమెకు 40 ఏళ్ల సర్వీసు వుంది. ఆమె సర్వీసుతో పాటు వేతనం కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.1.47 లక్షల వేతనం అందుకుంటోంది. ఈమె పే స్లిప్ వాట్సాప్‌లోకి ఎలా ఎక్కిందో తెలియదు కానీ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఆరా తీయగా, లక్షన్నర వేతనం నిజమేనని తేలింది.
Andhra Pradesh
Rajahmundry
Sweeper
whatsapp
Salary

More Telugu News