బీజేపీ, అమిత్ షాలకు కొత్త పేర్లను పెట్టిన కేటీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ, అమిత్ షాలకు కొత్త పేర్లను పెట్టిన కేటీఆర్!

  • బీరాలు పలికిన రేవంత్ రెడ్డి ఎక్కడ? 
  • చేతికి చీపురు ఇవ్వడం మినహా.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదు
  • కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమని బీరాలు పలికిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలంటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని... మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపాలని చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు భయపడుతున్నారని అన్నారు. పరీక్ష ముందు రోజు నైట్ ఔట్ చేసినట్టు కాంగ్రెస్ పరిస్థితి ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోయిందని అన్నారు. ఇన్నిరోజులు ప్రజల్లోకి వెళ్లని కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు హడావుడిగా ప్రజల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సనత్ నగర్ లో ఈరోజు జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్ ఈ మేరకు విమర్శలు గుప్పించారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, టీఆర్ఎస్ కొర్పొరేటర్లు హాజరయ్యారు.

భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. 2002లో గుజరాత్ లో నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. 2004లో వాజ్ పేయి ముందస్తుకు వెళ్లలేదా? అని అడిగారు. మీరు చేస్తే తప్పు కాదు... మేము చేస్తే తప్పా? అని మండిపడ్డారు.

బీజేపీ అంటేనే 'భారతీయ జూటా పార్టీ' అని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో అచ్చేదిన్ కాకుండా చచ్చేదిన్ వచ్చిందని విమర్శించారు. బ్లాక్ మనీని వెలికి తీసి... ఎంత మంది పేదలకు పంచారని ప్రశ్నించారు. చేతికి చీపురు ఇచ్చి స్వచ్ఛభారత్ అనడం మినహా... మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీజేపీ అధినేత పేరు అమిత్ షా కాదని, భ్రమిత్ షా అని దుయ్యబట్టారు. అమిత్ షా రోజుకొక రంగుల కల కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కాపాడుకుంటే చాలని అన్నారు. ఒక్క కార్పొరేటర్ ను కూడా గెలిపించుకోలేకపోయిన బీజేపీ నేతలు... ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ కు పోటీ అని తెలిపారు. 
KTR
amit shah
modi
Revanth Reddy
Uttam Kumar Reddy
congress
bjp
TRS
kcr

More Telugu News