మామయ్య, రానాల కష్టానికి ఇది నిదర్శనం: మంత్రి లోకేష్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మామయ్య, రానాల కష్టానికి ఇది నిదర్శనం: మంత్రి లోకేష్‌

  • ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం పోస్టర్‌పై ప్రశంసల జల్లు
  • ఇద్దరు లెజెండరీల చరిత్ర తెరకెక్కించడం సాహసం
  • ట్విట్టర్‌లో అభిప్రాయాన్ని పంచుకున్న యువనేత
‘ఇద్దరు  లెజెండరీల చరిత్రను తెరకెక్కించడం ఓ సాహసం. అటువంటి సాహసానికి పూనుకున్న మామయ్య బాలయ్యను, నటుడు రానాను అభినందిస్తున్నాను. ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం పోస్టర్‌ అద్భుతం’ అంటూ చంద్రబాబు తనయుడు, ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు పాత్రలు కలిసి ఉన్న పోస్టర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై లోకేష్‌ ట్విట్టర్‌లో స్పందించారు.
ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఇద్దరు వ్యక్తుల జీవిత గాథను తెరకెక్కించడమే సాహసమని, పైగా ఆనాటి పరిస్థితులను మళ్లీ సృష్టించడం చాలా గొప్ప విషయం అని లోకేష్ అన్నారు. బాలయ్య మామయ్య, రానా, చిత్ర బృందం పడుతున్న కష్టానికి ఈ పోస్టర్‌ నిదర్శనమని  పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్‌ చంద్రబాబుపై చేయి వేసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేయగా, నిజ జీవితంలో బాబుపై ఎన్టీఆర్‌ చెయ్యివేసి మాట్లాడుతున్న అరుదైన స్టిల్‌ను లోకేష్‌ పోస్టు చేశారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  బసవ తారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
Balakrishna
rana
NTR
Nara Lokesh

More Telugu News