వీరమాచనేని డైట్ తో నా షుగర్ తగ్గలేదు కానీ మా ఆవిడకు తగ్గింది!: మీడియాకు లేఖ రాసిన శాంతా బయోటెక్స్ అధినేత!
- వీరమాచనేని వ్యాఖ్యలపై వివరణ
- తనపై పెద్దగా ప్రభావం చూపలేదన్నవరప్రసాద్ రెడ్డి
- 80 రోజులు డైట్ పాటించినట్లు వెల్లడి
తాజాగా ఈ విషయమై వరప్రసాద్ ఓ పత్రికకు లేఖ రాశారు. తాను, తన భార్య 80 రోజుల పాటు వీరమాచనేని ఆహార నియమాలను పాటించినట్లు వరప్రసాద్ తెలిపారు. ఈ డైట్ కారణంగా తన భార్యకు మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఈ ఆహార నియమాలు తనపై పెద్దగా ప్రభావం చూపలేకపోయానని పేర్కొన్నారు. తన స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నట్లు తెలియడంతోనే ఈ లేఖ రాస్తున్నానని అన్నారు.
వీరమాచనేని డైట్ లో చెప్పిన విధంగా తామిద్దరం వరి బియ్యం, పప్పులు, పండ్లు, దుంపలు, చక్కెర, బెల్లం భోజనంలో లేకుండా జాగ్రత్త పడినట్లు తెలిపారు. రోజుకు ఆహారంలో 70 గ్రాముల కొబ్బరినూనెతో పాటు, ఆవు నెయ్యి, 2-3 కోడిగుడ్లు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఇన్సులిన్ మాత్రలు, ఇంజెక్షన్లను వాడలేదన్నారు. ఇలా 80 రోజులు పాటించినా ఈ డైట్ తన షుగర్ వ్యాధిపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనీ, తన భార్య షుగర్ మాత్రం నియంత్రణలోకి వచ్చిందని వెల్లడించారు. డైట్ పాటించిన కాలంలో తన షుగర్ నిల్వలు 180, 190కి తగ్గలేదని వరప్రసాద్ తెలిపారు.