పవన్ కల్యాణ్ గురించి ఎవరో అడిగితే.. తెలియదు అన్నాను: అశోక్ గజపతిరాజు

  • ఎన్టీఆర్ సినిమాలే సరిగా చూడలేదు.. వేరే సినిమాలు ఎలా చూస్తా?
  • నేను, పవన్ కలసి ప్రచారమే చేయలేదు
  • మోదీతో పాలనకు సంబంధించిన విషయాలే చర్చకు వచ్చేవి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలు చూడనని అన్నారెందుకు? అనే ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ గురించి తనను ఎవరో అడిగారని... దానికి సమాధానంగా ఆయనెవరో తనకు తెలియదని చెప్పానని అశోక్ అన్నారు. తాను ఎన్టీఆర్ సినిమాలే సరిగా చూడలేదని, ఇంక వేరేవారి సినిమాలు ఎలా చూస్తానని ప్రశ్నించారు. విజయనగరంలో తనకోసం ప్రచారం చేశానని పవన్ చెప్పారని... ఆయన, తాను కలసి ప్రచారమే చేయలేదని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

లోక్ సభకు వెళ్తారా? అని గతంలోనే ఎన్టీఆర్ తనను అడిగారని... అయితే రాజకీయాల్లో కొంచెం అనుభవం వచ్చాక వెళ్తే బాగుంటుందని తాను చెప్పానని అశోక్ తెలిపారు. ఇప్పుడు లోక్ సభలో ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో కూడా లోక్ సభకే ప్రయత్నిస్తానని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ మీద ఎంత గౌరవం ఉందో, చంద్రబాబు మీద కూడా తనకు అంతే గౌరవం ఉందని తెలిపారు.

వివిధ అంశాలపై చంద్రబాబు ఎక్కువగా విశ్లేషణలు చేస్తుంటారని, దాని ప్రభావం పనిపై ఉంటుందని అశోక్ అన్నారు. విశ్లేషణ, పని సమానంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రధాని మోదీతో తన పరిచయం నమస్కారం అంటే నమస్కారం అనే విధంగా ఉండేదని... ఇద్దరం ఎప్పుడైనా వ్యక్తిగతంగా మాట్లాడినా, పాలనకు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చకు వచ్చేవని చెప్పారు. వేరే విషయాల గురించి మాట్లాడటానికి ఆయన వద్ద అవకాశం ఉండదని అన్నారు.
Go Back to Shorts
ashok gajapathi raju
Chandrababu
modi
ntr
Pawan Kalyan

More Telugu News