నిన్న బీజేపీపై టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలే!: పురందేశ్వరి

  • దుగజరాజపట్నం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం
  • కడప స్టీల్ ఫ్యాక్టరీ జాప్యానికి కారణం చంద్రబాబు కాదా?
  • ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
నిన్న లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీపై టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేని భారతీయ జనతా పార్టీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, దుగజరాజపట్నం పోర్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ జాప్యానికి కారణం చంద్రబాబు కాదా? అని ప్రశ్నించిన ఆమె, ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో తాము ఎటువంటి రాజకీయాలు చేయడంలేదని, విశాఖకు రైల్వేజోన్ కచ్చితంగా ఇస్తామని చెప్పారు.

బీజేపీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ, నిన్న చంద్రబాబుపై రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయలేదనే ప్రచారాలు తగదని, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు నిమిత్తం స్థలం చూపించమని ప్రభుత్వాన్ని కోరామని, విశాఖకు రైల్వేజోన్ వస్తుందని అన్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అధికారికంగా లేఖలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల మాట్లాడుతూ, గతంలో ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకున్న చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. టీడీపీ మళ్లీ గెలిచే పరిస్థితి లేదని, కాంగ్రెస్ తో కలిసి గెలుస్తామనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు.
Go Back to Shorts
purandeswari
Telugudesam

More Telugu News