అక్క బాధ చూడలేకనే చిన్నారులను చంపేశానన్న నిందితుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్క బాధ చూడలేకనే చిన్నారులను చంపేశానన్న నిందితుడు!

  • అక్క పడుతున్న బాధలు, ఆర్థిక సమస్యలు చూడలేకపోయాడట
  • రూమ్ మేట్ వెంకట్రామిరెడ్డి సాయం తీసుకున్నాడు
  • పోలీసుల విచారణలో నిందితుడు మల్లికార్జునరెడ్డి వెల్లడి
హైదరాబాద్ లోని చైతన్యపురిలో మానసికంగా ఎదగని కవల పిల్లలను హతమార్చిన సంఘటన గురించి ఆశ్చర్యకర విషయాలు బయటకొస్తున్నాయి. ఆ పిల్లలను హతమార్చిన నిందితుడు, వారి మేనమామ మల్లికార్జునరెడ్డిని పోలీసులు విచారించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో తన అక్క లక్ష్మి పడుతున్న బాధలు, ఆర్థిక సమస్యలు చూడలేకనే ఆ ఇద్దరిని తాను చంపేశానని మల్లికార్జునరెడ్డి చెప్పినట్టు సమాచారం. తన రూమ్ మేట్ వెంకట్రామిరెడ్డి సాయంతో ఈ హత్య చేశానని చెప్పాడు.

కాగా, తమ పిల్లలను హత్య చేసిన సమాచారం తెలిసిన అనంతరం, చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు వారి తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ఈ హత్య వెనుక ఎలాంటి కుట్రలేదని, తన బావ మరిదితో తమకు ఎలాంటి గొడవలు లేవని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తన తమ్ముడు మల్లికార్జునరెడ్డిపై కేసు పెట్టేందుకు లక్ష్మి నిరాకరించడం, పైగా జరిగిందేదో జరిగిపోయిందంటూ ఆమె వ్యాఖ్యానించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో ఈ హత్య విషయం వీళ్లిద్దరికీ ముందే తెలుసేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, మల్లికార్జునరెడ్డికి సాయపడ్డ వెంకట్రామిరెడ్డిని, మృతదేహాలను తరలించేందుకు ఉపయోగించిన కారు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Hyderabad
chaitanya puri

More Telugu News