Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీతో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పిన శివసేన.. 'సామ్నా'లో సంపాదకీయం!

  • పాల్ఘర్ ఉప ఎన్నికల ఫలితాలు మా శక్తిని నిరూపించాయి
  • సొంతంగానే 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తాం
  • పార్టీ పత్రిక సామ్నాలో శివసేన స్పష్టీకరణ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ఈ రోజు సాయంత్రం కలుసుకోనుండగా, మరోవైపు శివసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. 2019 ఎన్నికల ముందు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉండదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ఇటీవలే జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ఉప ఎన్నికలో పార్టీ పనితీరును ప్రస్తావిస్తూ... ఈ పోలింగ్ ఫలితాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి పోస్టర్ కూడా తమకు అవసరం లేదని స్పష్టం చేశాయని అభిప్రాయం తెలియజేసింది. ఇరు పార్టీల అగ్రనేతల భేటీకి ముందు సామ్నా సంపాదకీయం రూపంలో శివసేన తన విధానం ఏంటో పరోక్షంగా తెలియజేసింది.

సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో దేశవ్యాప్తంగా పలు వర్గాలు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగానే షా ఈ రోజు బాలీవుడ్ బ్యూటీ  మాధురీదీక్షిత్ ను సైతం ముంబైలో కలుసుకున్నారు. అయితే, తాజా సామ్నా సంపాదకీయం ఈ కార్యక్రమాన్ని సైతం తప్పుబట్టింది.

‘‘ఇటీవలి ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీజేపీ ఎందుకని సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమం చేస్తోంది? శివసేన 2019 సాధారణ ఎన్నికలను సొంతంగానే ఎదుర్కొంటుంది. పాల్ఘర్ ఉప ఎన్నిక పార్టీ శక్తి ఏంటో నిరూపించింది. బీజేపీ అధికారంలో ఉండి కూడా ప్రజలతో సంబంధాలను కోల్పోయింది. కానీ, శివసేన ప్రజలతో మమేకమవుతూ, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. కనుక ఎన్నికల్లో గెలుపొందేందుకు ఏ పోస్టర్ బోయ్ అవసరం లేదు’’ అని సామ్నాలో శివసేన స్పష్టం చేసింది.
shiv sena
bjp

More Telugu News