ఎల్లలు దాటిన ప్రేమ: కామారెడ్డికి వచ్చి కారు డ్రైవర్ ను పెళ్లాడిన సౌదీ బిజినెస్ మేన్ కుమార్తె!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎల్లలు దాటిన ప్రేమ: కామారెడ్డికి వచ్చి కారు డ్రైవర్ ను పెళ్లాడిన సౌదీ బిజినెస్ మేన్ కుమార్తె!

  • సినిమా కథను తలదన్నే లవ్ స్టోరీ
  • సౌదీ వ్యాపారి వద్ద కారు డ్రైవర్ గా చేరిన అజీబుద్దీన్
  • లవ్ చేసిన వ్యాపారి కుమార్తె
  • పక్కా ప్లాన్ తో ఇండియాకు వచ్చి వివాహం
తన ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న యువకుడిపై మనసుపడ్డ ఆమె, ప్రేమకు అడ్డుగోడలు ఉండవని నిరూపిస్తూ సౌదీ అరేబియా నుంచి కామారెడ్డికి వచ్చి, అతనిని పెళ్లాడింది. అందుకోసం ఆమె సినిమా కథను తలదన్నే సాహసాన్ని చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కామారెడ్డికి చెందిన అజీబుద్దీన్ అనే యువకుడు జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి, నసీరుద్దీన్ ఇబ్రహీం అనే వ్యాపారి ఇంట కారు డ్రైవర్ గా పనికి కుదిరాడు.

తన మంచితనంతో ఆ ఇంట్లో వాళ్లందరికీ దగ్గరయ్యాడు. అజీబుద్దీన్ నడవడికను చూసిన నసీర్ కుమార్తె, అతనిపై మనసుపడింది. కారు డ్రైవర్ అయినా సరే అతనే కావాలనుకుంది. ఆరు నెలల క్రితం అజీబుద్దీన్ కు తన ప్రేమ గురించి చెప్పగా అతను భయపడ్డాడు. అతనికి ధైర్యం చెప్పింది. ఇండియాకు వెళ్లి బతుకుదామని అంది.

సౌదీలోనే ఉంటే పెళ్లికి ఎన్నో అడ్డంకులుంటాయని, తాము కలిసుండలేమని తెలుసుకున్న ఆమె, తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంది. ముందుగా అజీబుద్దీన్ ను ఇండియాకు పంపించింది. ఆపై గత నెల తొలివారంలో ఇల్లు దాటింది. ఢిల్లీ లేదా హైదరాబాద్ కు విమానం ఎక్కితే, తండ్రికి తెలిసిన వారుంటారన్న భయంతో, సౌదీ నుంచి నేపాల్ వెళ్లే విమానాన్ని ఎక్కింది. ఆపై ఢిల్లీకి చేరుకుని అజీబుద్దీన్ కు సమాచారం ఇవ్వగా, అతను వెళ్లి ఆమెను కామారెడ్డికి తీసుకొచ్చాడు. మే రెండో వారంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

తనకు పెళ్లయిన విషయాన్ని తండ్రికి ఫోన్ లో చెప్పగా, హైదరాబాద్ చేరుకున్న నసీరుద్దీన్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న కామారెడ్డికి వెళ్లిన పోలీసులు కొత్త జంటను విచారించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే ఇష్టపడి, అజీబుద్దీన్ కోసం వచ్చానని యువతి చెప్పింది. ఆమె మేజర్ అయినందున బలవంతంగా తీసుకు రాలేమని నసీరుద్దీన్ కు స్పష్టం చేసిన పోలీసులు, అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చారు. కామారెడ్డి ప్రాంతంలో వీరిద్దరి లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్.
Love Story
Saudi Arebia
Kamareddy
Lover
Driver

More Telugu News