ప్రతి విషయానికీ 'పుణ్యాత్ముడే'... రాహుల్ గాంధీని బలి పశువును చేస్తున్న కర్ణాటక సీఎం కుమారస్వామి!

  • ప్రతి విషయానికీ రాహుల్ ను సంప్రదిస్తున్న కుమారస్వామి
  • తాను అనుకున్నట్టు పాలన సాగకుంటే రాహుల్ ను బలిచేయాలన్న వ్యూహం
  • కర్ణాటక సీఎం కుమారస్వామి వైఖరిపై కాంగ్రెస్ నేతల గుస్సా
కాంగ్రెస్ సాయంతో కర్ణాటక సీఎం పదవిని అలంకరించిన హెచ్డీ కుమారస్వామి, ప్రతి విషయానికీ రాహుల్ గాంధీ సలహాలను అడుగుతూ, జరగబోయే పరిణామాలకు ఆయన్ను బలిపశువును చేయాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తనకు సీఎం పదవిని ఆఫర్ చేసిన 'పుణ్యాత్మ' రాహుల్ గాంధీకి తాను రుణపడివుంటానే తప్ప, 6.5 కోట్ల మంది కన్నడిగులకు కాదని ఇటీవల కుమారస్వామి సంచలన వ్యాఖ్యలే చేశారు. మంత్రి వర్గ కూర్పు నుంచి కీలకమైన రుణ మాఫీ అమలు వరకూ ప్రతి విషయానికీ, ఆయన స్థానికంగా ఉన్న సిద్ధరామయ్య, ఖర్గే, శివకుమార్ వంటి నేతలను సంప్రదించకుండా, ఎకాఎకీన రాహుల్ గాంధీతోనే మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

తాననుకున్నట్టుగా పాలన సాగకుంటే, మొత్తం తప్పిదాన్నంతా కాంగ్రెస్ అధ్యక్షుడిపై మోపాలన్న ఆలోచన కుమారస్వామిలో కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఎం పదవిపై కూర్చున్నప్పటి నుంచి కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయనో స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోందని, మొత్తం రాహుల్ గాంధీపై నెట్టేసే ఆలోచనలో ఉన్నారని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ హామీని తాను ఇవ్వలేదని ఆయన అంటున్నారని గుర్తు చేశారు. మరో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ, ప్రభుత్వాధినేతగా ఉండి, బాధ్యతలను తీసుకోకుండా, మద్దతిస్తున్న వారిని బలి చేయాలని చూస్తున్న ఆయన వైఖరి సమంజసం కాదన్నారు.
Go Back to Shorts
Karnataka
Kumara Swamy
Rahul Gandhi

More Telugu News