అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి: జేడీ చక్రవర్తి
- ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకే పరిమితం కాలేదన్న జేడీ చక్రవర్తి
- మహేశ్వరి, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమేనని వెల్లడి
- ఆర్జీవీకి కూడా కోపం వస్తుందన్న జేడీ
ఇండస్ట్రీలో 'కాస్టింగ్ కౌచ్' అనేది కేవలం మహిళలకే పరిమితం కాలేదని, అబ్బాయిలు కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటారని సినీ నటుడు జేడీ చక్రవర్తి కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు తాను విలన్‌గా చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో, తన స్నేహితురాలైన ఒక స్టార్ హీరోయిన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక సీనియర్ నిర్మాత ఆ హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు... తాను, నటుడు సురేశ్ మంచం కింద దాక్కుని ఆ సంభాషణ విన్నామని చెప్పి షాక్ ఇచ్చారు.
తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై స్పందిస్తూ, తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో తన పెళ్లిళ్లు జరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇక నటి మహేశ్వరితో తన అనుబంధం గురించి చెబుతూ, అప్పట్లో తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్న మాట వాస్తవమేనని, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని వివరించారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ, వర్మకు కోపం రాదని అందరూ అనుకుంటారని, కానీ 'సత్య' సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయని సంచలన విషయాలు బయటపెట్టారు.