కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్!
- రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
- జోరుగా జరుగుతున్న బెట్టింగ్ లు
- తుముకూరు, మంగళూరు, బెంగళూరు, మాండ్యా, రామ్ నగర్ జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న దందా
- జేడీఎస్ అభ్యర్థులపై అత్యధిక బెట్టింగ్స్
కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, బాదామి నుంచి సీఎం సిద్ధరామయ్య, బీజేపీ నేత శ్రీరాములు, జేడీఎస్ నేత హనుమప్ప పోటీ చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై జోరుగా బెట్టింగ్ జరుగుతోందట. అదేవిధంగా, చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్ధరామయ్య ఓడిపోతారనే వదంతుల నేపథ్యంలో అక్కడ కూడా జోరుగా బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. బళ్లారి అర్బన్, రూరల్ లో కూడా బెట్టింగ్ బాగా జరుగుతోందని పోలీసుల సమాచారం.
కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో జేడీఎస్ అభ్యర్థులపై అత్యధికంగా బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్ రాయుళ్లు తమ పందేలు కాస్తున్నట్టు సమాచారం. స్థానికంగా సదరు నేత ఏ పార్టీకి చెందిన వాడు? ఆ నేతకు ఉన్న ప్రజాదరణ, పోలింగ్ బూత్ స్థాయిలో జరిగిన ఓటింగ్ శాతాన్ని ఆధారంగా చేసుకుని బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.