రైలు ప్రమాదాల బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే... సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

  • 'ప్రయాణికుల నిర్లక్ష్యం' అంటే కుదరదు
  • నష్ట పరిహారం చెల్లించాల్సిందే
  • తీర్పిచ్చిన ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారిమన్ ల ధర్మాసనం
ఇకపై రైలు ప్రమాదాలు జరిగినప్పుడు 'ప్రయాణికుల నిర్లక్ష్యం' అన్న సాకు చూపించే అవకాశం ఉండదు. ఏ చిన్న ప్రమాదం జరిగినా అందుకు తగ్గ పరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సిందే. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ జారి పడి గాయాల పాలైనా, ప్రాణాలు కోల్పోయినా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అనేందుకు వీలు లేదని న్యాయమూర్తులు ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారిమన్ లతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది.

ప్రమాదాల బాధితులు రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124 ఏ ప్రకారం బాధితులకు నష్టపరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సి వున్నప్పటికీ, పలు సందర్భాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని రైల్వే శాఖ హైలైట్ చేస్తూ పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటుండగా, రైలు ప్రమాద కేసుల్లో హైకోర్టులు వివిధ రకాల తీర్పులను ఇస్తున్నాయి. ఇకపై ప్రమాదాలు జరిగితే పరిహారం రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని సుప్రీం తీర్పు ఆదేశించింది.
Go Back to Shorts
India
Railways
Train Accident
Supreme Court

More Telugu News