'మహానటి' సినిమాలో ఇంతటి గొప్ప పాత్రల్లో కనపడనుంది ఎవరో తెలుసా?: నాని
- విడుదలకు సిద్ధమవుతోన్న 'మహానటి'
- ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్
- కేవీ రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి
- వీడియో విడుదల చేసిన సినీనటుడు నాని
ఈ సినిమాలో అలనాటి దిగ్గజ దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఆ సినిమా వీడియో రూపంలో విడుదల చేసి, అందుకు సంబంధించిన లుక్‌ని కూడా విడుదల చేసింది. ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నాడు. 'మహానటుడు ఎన్టీఆర్‌ని తెలుగు చిత్ర సీమకు అందించిన ఎల్వీ ప్రసాదే.. మహానటి సావిత్రిని పెళ్లి చేసి చూడు సినిమాతో మనకు ఆస్తిగా ఇచ్చారు. ఆమెను మిస్సమ్మగా చూపించి మన అందరి గుండెల్లో కూర్చోపెట్టారు. ఇంతటి గొప్ప పాత్ర పోషించబోతోంది ఎవరో తెలుసా? మన అవసరాల శ్రీనివాస్' అంటూ యంగ్ హీరో నాని తన వాయిస్‌ని ఈ వీడియోకి జోడించాడు. అచ్చం ఎల్వీ ప్రసాద్‌లా అవసరాల శ్రీనివాస్ కనపడుతున్నాడు.
అలాగే మరో వీడియోలో.. అలనాటి దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో ఇప్పటి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నటిస్తున్నారని నాని చెబుతూ, క్రిష్ లుక్‌ను కూడా విడుదల చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో నాని ఈ వీడియోలను పోస్ట్ చేశాడు. కాగా, ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో షాలినీ పాండే, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, భాను ప్రియ, దివ్యవాణి కూడా నటిస్తున్నారు.