రైల్వే మంత్రిపై బిగుస్తోన్న ఉచ్చు
ఓ అధికారికి రైల్వే బోర్డులో స్థానం కల్పిస్తామంటూ పది కోట్ల రూపాయల లంచం ఆశించిన వ్యవహారంలో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. సదరు అధికారి నుంచి రూ. 90 లక్షలు స్వీకరించిన బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. విచారణలో సింగ్లా పలు విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. రైల్వే బోర్డులో స్థానం ఆశించిన అధికారి మహేశ్ కుమార్ తో తాను పలుమార్లు భేటీ అయ్యానని సింగ్లా ఈ సందర్భంగా తెలిపాడు. బన్సల్ నివాసంలోనే తామిద్దరం కలిసేవారమని సింగ్లా చెప్పడంతో ఈ వ్యవహారంలో బన్సల్ పాత్రపై అనుమానాలు బలపడ్డాయి. త్వరలోనే ఈ కేసులో బన్సల్ ను సీబీఐ విచారించనుంది. కాగా, బన్సల్ మేనల్లుడికి ఈనెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నేడు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.