సల్మాన్ ఖాన్ కు శిక్ష పడటంపై సంతోషం వ్యక్తం చేసిన సోఫియా హయత్
Add ap7am to your home Screen

సల్మాన్ ఖాన్ కు శిక్ష పడటంపై సంతోషం వ్యక్తం చేసిన సోఫియా హయత్

  • చేసిన కర్మలే సల్మాన్ కు ముగింపు పలికాయి
  • బాలీవుడ్ ను కంట్రోల్ చేసే సల్మాన్ కు ఎంతో మంది భయపడతారు
  • సమాజానికి సల్మాన్ ఎలాంటి సందేశం ఇస్తున్నారు?
కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ ఖాన్ కు శిక్ష పడిన నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది. ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ శిక్ష పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేసింది. నీవు చేసిన కర్మలే నీకు ముగింపును పలికాయంటూ సల్మాన్ ను ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పేర్కొంది. సల్మాన్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎంతో మంది భయపడతారని... ఎందుకంటే అతను బాలీవుడ్ ను కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉన్నాడని చెప్పింది. చేసిన తప్పుకు సల్మాన్ జైలుకు పోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపింది. ఈ భూమ్మీద జంతువులకు ఎంతో ప్రాధాన్యత ఉందని... వాటిని చంపడమే కాకుండా, చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం చాలా దారుణమని, అతని స్వార్థ భావజాలాన్ని ఇది సూచిస్తోందని చెప్పింది.

దేశ యువతకు సల్మాన్ ఒక రోల్ మోడల్ లాంటి వాడని... అలాంటి అతను తప్పు చేయకూడదని సోఫియా తెలిపింది. ఇలాంటి పనులు చేయడం ద్వారా సమాజానికి సల్మాన్ ఎలాంటి సందేశం ఇస్తున్నాడని ప్రశ్నించింది. సెలబ్రిటీ అయినంత మాత్రాన వన్యప్రాణులను చంపి, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడా? అని ప్రశ్నించింది. డ్రంకెన్ డ్రైవ్ ద్వారా కూడా మనుషుల ప్రాణాలను హరించాడని... వేరే దేశాల్లో అయితే సల్మాన్ తప్పించుకునేవాడా? అని అడిగింది. ఇన్ని తప్పులు చేసిన తర్వాత సమాజ సేవ చేసే వ్యక్తిగా సల్మాన్ అవతరించాడని విమర్శించింది. ఇప్పుడు పడిన శిక్షతో... 'నీవు ఎంత గొప్పవాడివైనా సరే, చట్టం ముందు నీవు చిన్నవాడివే' అనే విషయం సల్మాన్ కు అర్థమై ఉంటుందని చెప్పింది. 
Salman Khan
sofia hayat
jail
bollywood

More Telugu News