Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విదేశాల్లో షూటింగ్ మొదలెట్టేసిన శ్రీను వైట్ల!

  • రవితేజ హీరోగా శ్రీను వైట్ల మూవీ
  • విదేశాల్లో షూటింగ్ ప్రారంభం 
  • త్వరలో జాయిన్ కానున్న రవితేజ  
కొంతకాలంగా శ్రీను వైట్లను పరాజయాలు వెంటాడుతున్నాయి. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది హీరోలు వెనకాడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేయడానికి రవితేజ ముందుకు వచ్చాడు. గతంలో రవితేజకి శ్రీను వైట్ల వరుస హిట్లు ఇచ్చాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రవితేజ, శ్రీను వైట్లపై గల నమ్మకంతో ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి 'అమర్ అక్బర్ ఆంటోని' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఎక్కువగా జరుగనుంది. సైలెంట్ గా విదేశాలకి వెళ్లిన శ్రీను వైట్ల టీమ్ .. అక్కడ షూటింగును మొదలెట్టేశారనేది తాజా సమాచారం. అయితే ప్రస్తుతం రవితేజ ప్రమేయం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 'నేల టిక్కెట్టు' సినిమా షూటింగును పూర్తి చేసేసి, ఆ తరువాత శ్రీను వైట్ల సినిమా షూటింగులో రవితేజ జాయిన్ అవుతాడని అంటున్నారు. ఈ సినిమాలో సునీల్ ఓ ముఖ్యమైన రోల్ చేయనున్న సంగతి తెలిసిందే.  
srinu vaitla
raviteja

More Telugu News