పోకిరీ చెంప చెళ్లుమనిపించి.. కాలర్ పట్టుకుని పోలీసు స్టేషన్ తీసుకెళ్లిన మహిళ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోకిరీ చెంప చెళ్లుమనిపించి.. కాలర్ పట్టుకుని పోలీసు స్టేషన్ తీసుకెళ్లిన మహిళ

  • ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా వెంబడించిన పోకిరీలు
  • ఆటో ఎక్కి వెళ్తున్నా విడిచిపెట్టని వైనం
  • బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తుల అరెస్టు
బహిరంగంగా తన పట్ల అమానుషంగా వ్యవహరించిన ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించడమే కాక అతన్ని కాలర్ పట్టుకుని లాక్కెళ్లి పోలీసు స్టేషన్‌కు అప్పగించిందో మహిళ. పశ్చిమ ఢిల్లీలోని కరోల్ భాగ్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఘఫర్ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...(బాధిత) మహిళ తన ఫ్రెండ్‌తో కలిసి మార్కెట్‌లో నడుస్తుండగా నలుగురైదుగురు పోకిరీల బృందం ఆమెను వెంబడించి దుర్భాషలాడారు. వారి నుంచి తప్పించుకోవడానికి ఆమె, ఫ్రెండ్ కలసి ఓ ఆటో ఎక్కారు. అయినా సరే ఆకతాయిలు వారిని విడిచిపెట్టలేదు. ఆటోని అనుసరిస్తూ వారిని దుర్భాషలాడటం కొనసాగించారు.

దానిని తట్టుకోలేకపోయిన సదరు మహిళ ఒక్కసారిగా ఆటో నుంచి దిగి.. సరాసరి వెళ్లి పోకిరీల్లో ఒకరి చెంప చెళ్లుమనిపించింది. దాంతో అటుగా నడుస్తున్న వారు ఒక్కసారిగా అక్కడ గుమిగూడారు. అదే సమయంలో ఆ పోకిరీని ఆమె చొక్కా కాలర్ పట్టుకుని బరబరా లాక్కుపోయి సమీపంలోని పోలీసు స్టేషన్‌కి అప్పగించింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనకు సంబంధించి మనీశ్, అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రెండు నెలల కిందట ఢిల్లీలోని ఐటీఓ మెట్రో స్టేషన్ లోపల ఓ జర్నలిస్టు సహా ఇద్దరు మహిళల పట్ల ఓ తాగుబోతు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డయిన ఆ దృశ్యాలు షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే.
Delhi
Ghaffar Market
Woman

More Telugu News