మా శ్రీదేవి బతికే ఉంటుంది.. ఆమెకు మరణం లేదు: చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా శ్రీదేవి బతికే ఉంటుంది.. ఆమెకు మరణం లేదు: చిరంజీవి

  • వార్త తెలిసినప్పటి నుంచి మనసు మనసులో లేదు
  • శ్రీదేవికి నటన తప్ప మరో ధ్యాస లేదు
  • ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నా
అందం, అభినయం కలబోసిన అద్బుతమైన నటి, అతిలోకసుందరి శ్రీదేవి అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శ్రీదేవి లాంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో వస్తారని కూడా తాను భావించడం లేదని చెప్పారు. మా అతిలోక సుందరి ఈ విధంగా అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే... తనకు మింగుడు పడటం లేదని అన్నారు. ఇదొక చేదు నిజమని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు చాలా అన్యాయం చేశాడని... ఇంత చిన్న వయసులోనే ఆమెను తీసుకెళ్లిపోయాడని అన్నారు.

చిన్నతనం నుంచి శ్రీదేవికి నటన తప్ప మరొకటి తెలియదని... మరో ధ్యాస, మరో వ్యాపకం ఆమెకు లేదని చెప్పారు. అంతటి అంకితభావం ఉన్న నటీమణిని మనం చూడలేమని తెలిపారు. శ్రీదేవి అంకితభావాన్ని చూసి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని, స్పూర్తి పొందానని చెప్పారు. తన కెరీర్ ప్రారంభంలో 'రాణికాసుల రంగమ్మ' అనే సినిమా చేశామని... ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ... తమ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' అని తెలిపారు. ఆ సినిమాలో దేవత పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయిందని... ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా అనిపించిందని చెప్పారు. ఆ సినిమాలో శ్రీదేవి నటన చూసి తనకు 'వావ్' అనిపించిందని అన్నారు. ఆ తర్వాత 'ఎస్పీ పరశురాం' సినిమాలో కలసి నటించామని చెప్పారు.

సినిమాల పరంగానే కాకుండా... ఆమె కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. వారి కుటుంబంలో కానీ, తమ కుటుంబంలో కానీ ఎలాంటి వేడుకలు జరిగినా కలుసుకునేవారమని చెప్పారు. తన 60వ పుట్టినరోజు వేడుకకు కూడా శ్రీదేవి, బోనీకపూర్ ఇద్దరూ వచ్చారని, తనను విష్ చేశారని తెలిపారు. ఉదయం ఆమె మరణ వార్తను వినగానే ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని చెప్పారు.

వాస్తవాన్ని జీర్ణించుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనసు మనసులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంత గొప్ప శ్రీదేవిని పోగొట్టుకోవడం మనందరి దురదృష్టమని చెప్పారు. భగవంతుడు చాలా అన్యాయం చేశాడని... మన శ్రీదేవిని మనకు దూరం చేశాడని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడుని వేడుకుంటున్నానని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కోటానుకోట్ల మంది ప్రేమను పొందిన శ్రీదేవి... అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. శ్రీదేవికి మరణం లేదని... సినీ ప్రపంచం ఉన్నంత వరకు మా శ్రీదేవి బతికే ఉంటుందని చిరంజీవి ఉద్వేగానికి గురయ్యారు. 
chiranjeevi
sreedevi
condolences

More Telugu News