పాఠశాల విద్యార్థులకు 'మాట్లాడే' పుస్తకాలు..!

  • తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పుస్తకాల ముద్రణ
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్టూడెంట్లకు పంపిణీ
  • 'డాల్ఫియో టాకింగ్ పెన్‌'తో పదాలు పలుకుతాయ్
ఇప్పటివరకు చూసి చదువుకునే పుస్తకాలు మాత్రమే మనకు తెలుసు. కానీ, త్వరలో వాటికవే మాట్లాడే పుస్తకాలు కూడా రాబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు వీటిని సిద్ధం చేస్తున్నారు. తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో వీటిని ముద్రించారు. ఒక్కో మాధ్యమంలో 100 రకాల పుస్తకాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సర్వశిక్షా అభియాన్ సహకారంతో వీటిని యూనిసెఫ్ తయారు చేస్తోంది. వీటిని బెంగళూరులో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్రించారు. మొదటి దశ కింద వంద ప్రాథమిక పాఠశాలలకు వీటిని పంపిణీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం మరో 400 బడులకు అందజేస్తారు.

ఒక్కో పాఠశాలకు తెలుగు, ఆంగ్ల మాధ్యమం పుస్తకాలను పంపిస్తామని విద్యా శాఖ కమీషనర్ కిషన్ తెలిపారు. బాల కార్మికులు, స్వచ్ఛ పర్యావరణం, హరిత పర్యావరణం, బాలికా విద్య, జీవన నైపుణ్యాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పెంపుడు జంతువులు, నీటి నిర్వహణ, పౌష్టికాహారం వంటి మొత్తం పది అంశాలపై కథల రూపంలో ఈ పుస్తకాలను ముద్రించారు. ఈ పుస్తకాల ప్రత్యేకతగా డాల్ఫియో టాకింగ్ పెన్ (రీడర్)ని చెప్పుకోవాలి. దీని ఖరీదు సుమారు రూ.2500. దీని రూపకల్పనకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ కోసం సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పెన్‌ని పుస్తకంలోని ఏ పదంపై ఉంచితే అంతవరకు మాట వినిపిస్తుంది. ఒకవేళ ఒక వరుసపై పెడితే ఆ మొత్తాన్ని చదివేలా రీడర్‌లో మార్పు చేసుకోవచ్చు. అంతేకాక పుస్తకంలోని బొమ్మల వద్ద ఉంచితే వాటి సంభాషణనూ వినవచ్చు.
Go Back to Shorts
Telangaana
UNICEF
Dolphio talking pen
Students

More Telugu News