పోలీసుల ప్రశ్నల వర్షంతో జవాబులు చెప్పలేక రాంగోపాల్ వర్మ ఉక్కిరిబిక్కిరి!
- తొలుత వాతావరణాన్ని తేలిక పరిచేలా ప్రశ్నలు
- ఆపై అసలు విషయం గురించి సమాచార సేకరణ
- పలు ప్రశ్నలకు మౌనమే వర్మ సమాధానం
ఇటీవలి కాలంలో ఆయన పెట్టిన ట్వీట్లు, 'జీఎస్టీ' చిత్రం కలెక్షన్లు, నాగార్జునతో తీస్తున్న చిత్రం గురించిన వివరాలను ఆయన్నుంచి తెలుసుకుని వాతావరణాన్ని కాస్తంత తేలిక చేసిన తరువాత వర్మతో అసలు విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సినిమా విదేశాల్లో తీసిన చిత్రం కావడంతో భారత చట్టాలు వర్తించవని వర్మ చెప్పగా, మహిళలను అశ్లీలంగా చూపించడం ఐటీ యాక్ట్ ప్రకారం తప్పేనని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
ఇక తాను స్కైప్ ద్వారా మాత్రమే సినిమాకు దర్శకత్వం వహించానని వర్మ చెప్పగా, సినిమా కోసం మియా మాల్కోవా ఇండియాకు వచ్చిందా? అని పోలీసులు ప్రశ్నించారు. ఆమె రాలేదని, చిత్రం ఇండియాలో తీసింది కాదని పోలీసులకు వర్మ స్పష్టం చేసిన వేళ, మియా నగ్నంగా ఉండగా, ఆమె ముందు వర్మ కూర్చుని సూచనలు ఇస్తున్న దృశ్యాలను చూపించి, దానికి సమాధానం ఏంటని ప్రశ్నించినట్టు పోలీసు వర్గాల సమాచారం. ఈ ప్రశ్నకు వర్మ నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదని తెలుస్తోంది.