మిగతా దక్షిణ భారత రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలి: గల్లా జయదేవ్

  • టీడీపీ ఎంపీలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం
  • విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయాం
  • ప్రత్యేక ప్యాకేజ్ ప్రకారం 90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి
  • టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
రాష్ట్రాన్ని అసంబద్ధంగా విభజించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం ముఖ్యనేతలు, అందుబాటులో ఉన్న ఎంపీలతో సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో ఈరోజు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన గల్లా జయదేవ్ మాట్లాడుతూ, విభజన సమయానికి రాష్ట్రం విద్యుత్ లోటుతో, లోటు బడ్జెట్ లో ఉందని, విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని అన్నారు. మిగతా దక్షిణ భారత రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు రాజ్యసభలో ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రత్యేక ప్యాకేజ్ ప్రకారం 90: 10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలని, తలసరి ఆదాయం ప్రకారం చూసుకుంటే రాష్ట్రానికి చాలా రావాల్సి ఉందని అన్నారు. ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంటులోనూ అన్ని పక్షాలు డిమాండ్ చేశాయని, ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అందరికీ అర్థమైందని అన్నారు. ఏపీలో జాతీయ రహదారుల కోసం లక్ష కోట్ల రూపాయలు చేశామని కేంద్ర ప్రభుత్వం అంటోందని, కానీ, ఖర్చు చేసింది కేవలం రూ.5,900 కోట్లు మాత్రమేనని అన్నారు. 
Go Back to Shorts
Telugudesam
Andhra Pradesh
galla jayadev

More Telugu News