చెన్నై 'ప్రియ'దర్శిని వలపు వల... ఐదు రోజుల్లోనే పరిచయం, ప్రేమ, పెళ్లి.. నిలువునా ముంచేస్తుంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నై 'ప్రియ'దర్శిని వలపు వల... ఐదు రోజుల్లోనే పరిచయం, ప్రేమ, పెళ్లి.. నిలువునా ముంచేస్తుంది!

  • 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అంటూ అందంతో ఎర
  • రూ. 100 కోట్ల ఆస్తి ఉందని మోసపు మాటలు
  • అందిన కాడికి దండుకుని పారిపోయే ప్రియదర్శిని
  • మోసపోయిన వరంగల్ ప్రముఖుడి పుత్రరత్నం
ఏదో ఒక రూపంలో పరిచయం అవుతుంది. పరిచయమైన రెండో రోజే 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అంటూ తన వలపు అందంతో ఎరేస్తుంది. పడ్డారా? వెంటనే పెళ్లంటుంది. తన వద్ద రూ. 100 కోట్ల ఆస్తి ఉందని, నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేనని, కాదంటే చచ్చిపోతానని చెబుతుంది. పరిచయాన్ని రోజుల్లోనే పెళ్లి వరకూ పరుగులు పెట్టిస్తుంది. ఆపై నాలుగు రోజులు స్టార్ హోటళ్లలో జల్సా చేస్తుంది. ఏటీఎం కార్డుల్లోని డబ్బు తీయిస్తుంది. ఆపై అందినంత నగదు, నగలు దోచుకుని మాయమవుతుంది.

స్నేహం, ప్రేమ, పెళ్లి పేరిట తెలుగు యువకులను, ముఖ్యంగా డబ్బున్నవారిని ఎంచుకుని వల వేసే ఈ చెన్నై మాయా సుందరి ప్రస్తుత పేరు ప్రియదర్శిని. ఇలా ఎంతమందిని మోసం చేసిందో తెలియదుగానీ, ఆమె చేతిలో నిలువు దోపిడీకి గురైన ఓ వరంగల్ ప్రముఖుడి కుమారుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. తనను తాను డాక్టర్ గా పరిచయం చేసుకుని, విడిచి ఉండలేనని వెంటబడి, 5 రోజుల్లోనే పెళ్లి చేసుకుందని, తన డబ్బుతో స్టార్ హోటల్స్ లో జల్సా చేసి, లక్షల రూపాయలను షాపింగ్ కు ఖర్చు పెట్టిందని సదరు యువకుడు ఫిర్యాదు చేశాడు.

తన వద్ద కోట్ల కొద్దీ డబ్బుందని, పలు ఆస్తులున్నాయని నమ్మబలికిందని చెప్పాడు. ఆమె ఫొటోను చూసిన పోలీసులు, కేసును సీరియస్ గా తీసుకుని, గతంలో చెన్నైలో పలువురు వ్యాపారులకు ప్రియదర్శిని టోకరా ఇచ్చిందని, చెల్లని చెక్కులతో ఖరీదైన బైకులు, కార్లు బుక్ చేసి, డబ్బులడిగితే కనిపించకుండా పోయిందని, ఆ యువతే, ఇప్పుడు వరంగల్ యువకుడిని మోసం చేసిందని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Chennai
Priyadarshini
Doctor
Marriage
Cheating
Warangal

More Telugu News