తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన నారా లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన నారా లోకేశ్

  • అమరావతిలోని సీఎం నివాసంలో వివరాలు వెల్లడించిన లోకేశ్
  • మా నాన్న ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదు
  • మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోంది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను ఆయన తనయుడు లోకేశ్ ప్రకటించారు. అమరావతిలోని సీఎం నివాసంలో లోకేశ్ మాట్లాడుతూ, తమ కుటుంబం ఆస్తులను ప్రకటిస్తూ రావడం వరుసగా ఇది ఏడోసారి అని పేర్కొన్నారు. యావత్ భారత్ దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఈ విధంగా తమ ఆస్తులను ప్రకటించలేదని అన్నారు. తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పులేదని లోకేశ్ పేర్కొన్నారు.

కాగా,  ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు తన, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను విడుదల చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి నాడు తెరదీశారు. తమపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసే ముందు వాళ్ల ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని, పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని కోరారు. లోకేశ్ ప్రకటించిన కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు..

* చంద్రబాబు నికర ఆస్తులు :రూ. 2.53 కోట్లు

* భువనేశ్వరి ఆస్తులు : రూ. 25.41 కోట్లు

* లోకేశ్ నికర ఆస్తులు: రూ. 15.21 కోట్లు

* బ్రహ్మణి నికర ఆస్తులు: రూ.15.01 కోట్లు

* దేవాన్ష్ నికర ఆస్తులు: రూ.11.54 కోట్లు
నారా లోకేశ్
టీడీపీ

More Telugu News