వ్యాపారం పేరిట హైదరాబాదు నుంచి సింగపూర్ తీసుకెళ్లి.. హత్య చేశారు!

  • హైదరాబాదు కుషాయిగూడకు చెందిన వ్యాపారి సింగపూర్ లో దారుణ హత్య
  • వ్యాపారం పేరుతో సింగపూర్ తీసుకెళ్లి కిడ్నాప్ డ్రామా 
  • 3 కోట్లు ఇస్తే వదిలేస్తామని కుటుంబ సభ్యులతో బేరసారాలు 
సింగపూర్ లో హైదరాబాదు వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాదులోని కుషాయిగూడకు చెందిన వాసుదేవ్ రాజ్ అనే యువకుడిని బంగారం వ్యాపారం పేరుతో నిందితులు సింగపూర్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం అతనిని గదిలో బంధించారు. తర్వాత అతనిని బంధించామని చెబుతూ అతని ఫోటోలు తీసి కుటుంబ సభ్యులకు పంపారు. అనంతరం ఫోన్ చేసి 3 కోట్ల రూపాయలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేశారు.

దీంతో తాము పేదవాళ్లమని, వాసుదేవ్ ధరించిన దుస్తులు చూస్తే తమ ఆర్థిక పరిస్థితి తెలుస్తుందని, తాము అంత ఇచ్చుకోలేమని కుటుంబ సభ్యులు దీనంగా చెప్పారు. డబ్బులివ్వకపోతే చంపేస్తామని హెచ్చరించిన దుండగులు...కుటుంబ సభ్యుల స్పందన ఆలస్యం కావడంతో అతనిని హతమార్చారు. ఈ హత్యకు సంబంధించిన సమాచారాన్ని సింగపూర్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు అతని కుటుంబ సభ్యులకు అందించారు. రెండు మూడు రోజుల్లో అతని మృతదేహం హైదరాబాదు చేరుకోనుందని వారు వెల్లడించారు.
Go Back to Shorts
hyderabadi
singapore
murder
bussiness man murder

More Telugu News