డెలివరీ బాయ్ ను, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన చిలుక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డెలివరీ బాయ్ ను, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన చిలుక!

  • ఏడుస్తూ రక్షించండి రక్షించండి అని అరిచిన డియాగో అనే చిలుక
  • డియాగో యజమాని సుసాన్ బయటకు వెళ్లడంతో చిలుక ఆందోళన
  • రక్షించమంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన డెలివరీ బాయ్ 
ఒక డెలివరీ బాయ్ ను, పోలీసులను ఒక చిలుక ఉరుకులు పరుగులు పెట్టించిన ఘటన అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఒరెగాన్ లో నివసించే సుసాన్ బైర్డ్ ఒక చిలుకను పెంచుకుంటోంది. తాజాగా ఒకరోజు ఆమె ఇంటికి అవసరమైన వస్తువులను ఆర్డర్‌ చేసింది. వాటిని ఆమెకు అందజేసేందుకు లీపుర్డే అనే డెలివరీ బాయ్ ఆ అడ్రెస్ కి వెళ్లేసరికి ఆ ఇంట్లోంచి 'రక్షించండి.. రక్షించండి’ అంటూ ఏడుస్తున్న ఓ మహిళ గొంతు అతడికి వినిపించింది. మహిళ ఎవరో ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించిన డెలివరీ బాయ్‌ వెంటనే 911కి కాల్‌ చేశాడు.

దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచి ఆ ఇంట్లో ప్రవేశించారు. అయితే వారు ఇంట్లోకి వెళ్లి వెతికే సరికి మహిళ ఎవరూ కనబడలేదు. ఇంతలో అక్కడున్న ఓ చిలుక అలా మహిళ గొంతుతో మళ్లీ అరుస్తూ కనిపించింది. దీంతో తమని అంతగా కంగారు పెట్టింది ఆ చిలుకన్న విషయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు, డెలివరీ బాయ్ చివరికి నవ్వుకున్నారు.

ఇంతకీ ఆ చిలుక పేరు డియాగో... దీనిని సుసాన్ పెంచుకుంటోందని, ఆమె బయటకు వెళ్లడంతో అది ఇలా కంగారు పెట్టిందని పోలీసులు తెలిపారు. అయితే తరువాత ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న సుసాన్.. తాను బయటకు వెళ్లడంతో ఒంటరితనం ఫీలైన డియాగో అలా ఏడ్చి ఉంటుందని ఆమె చెప్పింది. 
parrot
america
oregon

More Telugu News