మలుపు తిరిగిన ఢిల్లీ 'రేయాన్' స్కూలు విద్యార్థి హత్య కేసు.. సీనియర్ విద్యార్థిపైనే సీబీఐ అనుమానం!
- తెరపైకి 11వ తరగతి విద్యార్థి పేరు
- పరీక్ష వాయిదా వేయించేందుకు హత్య చేశాడని భావిస్తున్న సీబీఐ
- కండక్టర్ కు కూడా క్లీన్ చిట్ ఇవ్వలేమన్న సీబీఐ
ఈ ఘటనకు సంబంధించి అదే స్కూల్లో చదువుతున్న 11వ తరగతికి చెందిన ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామని సీబీఐ తెలిపింది. అతను చదువులో వెనుకబడ్డాడని... దీంతో, పరీక్షలు వాయిదా పడాలని అతను కోరుకున్నాడని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కారణంగానే ప్రద్యుమన్ ను హత్య చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని చెప్పారు.
కేసులో ఈ విద్యార్థిని ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. విచారణ కోసం సదరు విద్యార్థిని జువైనల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరుతోంది. మరోవైపు, కండక్టర్ కు ఇప్పటికిప్పుడే క్లీన్ చిట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అతనిపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతుందని తెలిపింది.