Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చూసేందుకు వచ్చి వధువుగా మారిన యువతి.. 'సినిమాను తలపించే ఘటన!

  • వధువు మైనర్ కావడంతో పెళ్లిని ఆపించిన పోలీసులు
  • పెళ్లి పందిరిలోని యువతిని ఎంపిక చేసిన బంధువులు
  • అనుకున్న ముహూర్తానికే వివాహం
పెళ్లి వేడుకకు హాజరైన యువతి అనూహ్యంగా పెళ్లి కూతురుగా మారింది. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిందీ ఘటన. కల్యాణ ఘడియ దగ్గర పడితే ఆగదన్న సామెతను ఈఘటన రుజువు చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తిరుచ్చిలోని తురైయూరుకు చెందిన వెంకటేశన్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. మన్నసనల్లూరుకు చెందిన కనకతో వెంకటేశన్‌కు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. బుధవారం వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే సినిమాల్లోలా సరిగ్గా వరుడు తాళి కట్టే సమయానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ‘ఆపండి’ అంటూ పెళ్లి తంతును ఆపించారు.

వధువు ఇంకా మైనర్ కాబట్టి ఈ వివాహం చట్టప్రకారం నేరం అవుతుందని చెప్పడంతో అందరూ బిక్క మొహం వేశారు. పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేయడం, బంధువులు అందరూ రావడంతో ఎలాగైనా వివాహం జరిపించాలని నిర్ణయించిన వరుడి తరపు బంధువులు పెళ్లి కొచ్చిన అమ్మాయిల్లో వధువు కోసం వెతికారు. చివరికి వెంకటేశన్ దూరపు బంధువు కుమార్తెను ఎంపిక చేసి అనుకున్న సమయానికి వివాహం జరిపించి ఊపిరి పీల్చుకున్నారు.
Marriage
Tamilnadu
Police

More Telugu News