ఆధార్ పై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
- ఆధార్ తో దేశ భద్రతకు ముప్పు
- అమెరికా చేతిలోకి డేటా వెళ్లే అవకాశం
- ప్రధానికి లేఖ రాస్తా
ఆధార్ అనుసంధానాలను సుప్రీంకోర్టు అడ్డుకుంటుందనే నమ్మకం తనకు ఉందని స్వామి చెప్పారు. మొబైల్ నంబర్లను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. ఇది జరిగిన మరుసటి రోజే సుబ్రహ్మణ్యస్వామి దీనిపై స్పందించారు. మరోవైపు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, పలు అంశాలకు ఆధార్ ను లింక్ చేయడంపై పలు పిటిషన్లు వచ్చాయని, వీటిని త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఆధార్ కు సంబంధించి కోర్ సాఫ్ట్ వేర్ ను ఓ అమెరికన్ కంపెనీ డెవలప్ చేస్తుండటంతో... డేటా సెక్యూరిటీపై అందరిలో అనుమానాలు నెలకొన్నాయని స్వామి అన్నారు. ఈ సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలు తమ స్వార్థ కార్యకలాపాలకు వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు.