Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆధార్ పై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

  • ఆధార్ తో దేశ భద్రతకు ముప్పు
  • అమెరికా చేతిలోకి డేటా వెళ్లే అవకాశం
  • ప్రధానికి లేఖ రాస్తా
ప్రతి అంశానికి ఆధార్ ను లింక్ చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధార్ వల్ల దేశ భద్రతకే ముప్పు ఉందని ఆయన తెలిపారు. ప్రతి అంశానికి ఆధార్ నంబరును లింక్ చేయాలన్న ఆలోచన ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సవివరంగా వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపారు.

ఆధార్ అనుసంధానాలను సుప్రీంకోర్టు అడ్డుకుంటుందనే నమ్మకం తనకు ఉందని స్వామి చెప్పారు. మొబైల్ నంబర్లను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. ఇది జరిగిన మరుసటి రోజే సుబ్రహ్మణ్యస్వామి దీనిపై స్పందించారు. మరోవైపు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, పలు అంశాలకు ఆధార్ ను లింక్ చేయడంపై పలు పిటిషన్లు వచ్చాయని, వీటిని త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

ఆధార్ కు సంబంధించి కోర్ సాఫ్ట్ వేర్ ను ఓ అమెరికన్ కంపెనీ డెవలప్ చేస్తుండటంతో... డేటా సెక్యూరిటీపై అందరిలో అనుమానాలు నెలకొన్నాయని స్వామి అన్నారు. ఈ సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలు తమ స్వార్థ కార్యకలాపాలకు వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. 
subrahmanian swamy
aadhar
supreme court

More Telugu News