ఈ భార్యాభర్తలు నరమాంస భక్షకులు... 30 మందిని తినేశారు!
- 30 మందిని హతమార్చి భక్షించిన దంపతులు
- భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న భర్త
- తోటి కార్మికుడు ఫోన్ చూడడంతో వెలుగు చూసిన దారుణం
భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసే భక్షీవ్ ఒక రోజు పని ముగిసిన తరువాత తన మొబైల్ ఫోన్ ను రోడ్డుపక్కన మర్చిపోయాడు. ఆ మొబైల్ ను చూసిన తోటి కార్మికుడు అందులోని ఫోటోలు చూసి బిత్తరపోయాడు. దాని నిండా మనిషి శరీరాన్ని ఖండఖండాలుగా నరికిన ఫోటోలు. దీంతో అతను మరిన్ని ఫోటోలు చూడగా, ఆ ఫోన్ ఎవరిదో వెంటనే తెలిసిపోయింది. ఎందుకంటే ఆ తరువాతి ఫోటోలో తనతో పాటు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే భక్షీవ్... ఒక మనిషి శరీర భాగాన్ని నోట్లో పెట్టుకుంటూ నవ్వుతున్నాడు. దీంతో అతను బిత్తరపోయాడు.
వెంటనే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఫోన్ ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు, ఆ దంపతులిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ విచారణలో 30 మందిని హతమార్చి తినేసినట్టు వారు తెలిపారు. 1999 నుంచి తాము నరమాంస భక్షణకు అలవాటుపడ్డామని వారు చెప్పారు.
ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, అక్కడ తమకు మానవ శరీర భాగాలు కనిపించాయని తెలిపారు. సుమారు పదేళ్లుగా ఆ ఇంట్లో నివాసముంటున్న భక్షీవ్ దంపతులు తమకు తెలుసని ఆ పక్కనే ఉన్న దుకాణదారు తెలిపారు. భక్షీవ్ భవన నిర్మాణ కార్మికుడిగా రెక్కలుముక్కలు చేసుకుంటే, అతని భార్య మాత్రం ఇంట్లో కూర్చుని ఫుల్లుగా మద్యం తాగేదని వారు తెలిపారు.