ఈ భార్యాభర్తలు నరమాంస భక్షకులు... 30 మందిని తినేశారు!

  • 30 మందిని హతమార్చి భక్షించిన దంపతులు
  • భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న భర్త 
  • తోటి కార్మికుడు ఫోన్ చూడడంతో వెలుగు చూసిన దారుణం
రష్యాలో ఇద్దరు నరమాంస భక్షకుల విషయం వెలుగు చూసింది. రష్యాలోని క్రాస్‌నోడర్‌ లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసే దిమిత్రీ భక్షీవ్ (35), ఆయన భార్య నటాలీ (42) లను అరెస్టు చేసేవరకు చుట్టుపక్కల ఎవరికీ వారి నిజస్వరూపం తెలియకపోవడం విశేషం.

 భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసే భక్షీవ్ ఒక రోజు పని ముగిసిన తరువాత తన మొబైల్ ఫోన్ ను రోడ్డుపక్కన మర్చిపోయాడు. ఆ మొబైల్ ను చూసిన తోటి కార్మికుడు అందులోని ఫోటోలు చూసి బిత్తరపోయాడు. దాని నిండా మనిషి శరీరాన్ని ఖండఖండాలుగా నరికిన ఫోటోలు. దీంతో అతను మరిన్ని ఫోటోలు చూడగా, ఆ ఫోన్ ఎవరిదో వెంటనే తెలిసిపోయింది. ఎందుకంటే ఆ తరువాతి ఫోటోలో తనతో పాటు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే భక్షీవ్... ఒక మనిషి శరీర భాగాన్ని నోట్లో పెట్టుకుంటూ నవ్వుతున్నాడు. దీంతో అతను బిత్తరపోయాడు.

వెంటనే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఫోన్ ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు, ఆ దంపతులిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ విచారణలో 30 మందిని హతమార్చి తినేసినట్టు వారు తెలిపారు. 1999 నుంచి తాము నరమాంస భక్షణకు అలవాటుపడ్డామని వారు చెప్పారు.

ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, అక్కడ తమకు మానవ శరీర భాగాలు కనిపించాయని తెలిపారు. సుమారు పదేళ్లుగా ఆ ఇంట్లో నివాసముంటున్న భక్షీవ్ దంపతులు తమకు తెలుసని ఆ పక్కనే ఉన్న దుకాణదారు తెలిపారు. భక్షీవ్ భవన నిర్మాణ కార్మికుడిగా రెక్కలుముక్కలు చేసుకుంటే, అతని భార్య మాత్రం ఇంట్లో కూర్చుని ఫుల్లుగా మద్యం తాగేదని వారు తెలిపారు. 
Go Back to Shorts
cannibals
Russian couple

More Telugu News