Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ నా శిష్యుడు.. నేను చెబితే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మీకే!: భక్తులను బురిడీ కొట్టిస్తున్న కొత్త బాబా

  • మరో దొంగ బాబా అరెస్ట్
  • కేసీఆర్ తన భక్తుడంటూ మోసం
  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ మాయ
  • లక్షలు కొల్లగొట్టిన వైనం
తన వద్దకు వచ్చే భక్తులను మాయ మాటలతో వలలో వేసుకుంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక బీదర్ జిల్లాకు చెందిన బాబా ఇర్ఫాన్ షా ఖాద్రి (68) హైదరాబాద్ శివార్లలోని జల్ పల్లి పరిధిలోని పహాడీషరీఫ్ కొండపై ఉన్న బాబా షర్పుద్దీన్ భక్తుడు. గతంలో వారానికోసారి వచ్చి బాబా సమాధిని దర్శించుకునేవాడు. అతనికి పాతబస్తీలో ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారి సలహాతో కొండపైనే ఓ గదిలో మకాం వేశాడు. తనకు మహిమలు ఉన్నాయంటూ బాబా అవతారం ఎత్తాడు. దీంతో, క్రమేణా అతనికి భక్తులు పెరిగారు.

ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనకు శిష్యుడేనని... తాను చెప్పినవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తాడని భక్తులను నమ్మించాడు. ఈ క్రమంలో ఒక్కో భక్తుడి నుంచి రూ. 12 వేలు వసూలు చేశాడు. మొత్తం 60 మంది నుంచి రూ. 7.20 లక్షలు కొల్లగొట్టాడు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో... రెండు రోజుల క్రితం అతను ఉండే చోట దాడులు చేసి... అతన్ని, అతని ఇద్దరు శిష్యులను అరెస్ట్ చేశారు.
fake baba
hyderabad fake baba

More Telugu News