Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీ ప్రతి కన్నీటి చుక్కా మా హృదయాలను రగిలిస్తోంది: మరణించిన సోల్జర్ కుమార్తెను ఓదార్చుతున్న సైన్యం

కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులను సమూలంగా ఏరివేసేందుకు గత కొంత కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్న భద్రతా దళాలు ఓ వైపు విజయం సాధిస్తూనే, మరోవైపు తమవారి ప్రాణాలనూ కోల్పోతున్న వేళ, ఉగ్రదాడిలో మరణించిన ఓ జవాను కుమార్తెను ఓదార్చేందుకు సైన్యాధికారులు కదిలొచ్చారు. గత వారంలో పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 8 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల క్రితం సోమవారం నాడు తన రోజువారీ విధి నిర్వహణలో భాగంగా అబ్దుల్ రషీద్ పీర్ అనే జవాను అనంతనాగ్ జిల్లాలోని ఓ మార్కెట్ ప్రాంతానికి వెళ్లగా, ఉగ్రవాదులు దాడి చేసి కాల్చి చంపారు.

మరణించిన అబ్దుల్ రషీద్ కు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు జోహ్రా. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె, బోరున విలపిస్తుంటే ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన అధికారుల కళ్లు చమర్చాయి. "మా నాన్న ఏ తప్పూ చేయలేదు. ఆయన్ను ఎందుకు చంపారు? నాన్నను తలచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆయన్ను హత్యచేసిన వారు శిక్షించబడాలి" అని జోహ్రా అక్క అక్కడికి వచ్చిన అధికారులతో చెప్పింది.

ఇక జోహ్రా బాధను తెలుసుకున్న దక్షిణ కాశ్మీర్ పోలీస్ డీఐజీ "నీ కన్నీరు ఎంతో మంది హృదయాలను తాకుతోంది. ప్రతి కన్నీటి చుక్కా ప్రతీకారేచ్ఛను రిగిలిస్తోంది. నీ తండ్రి ఓ నిజమైన పోలీసు అధికారి. డ్యూటీ చేస్తూ త్యాగం చేసిన అమరజీవి. బాధపడకు" అంటూ తన ఫేస్ బుక్ లో పోస్టును పెడుతూ జోహ్రా కన్నీరు కారుస్తున్న ఫోటోను యాడ్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. కాగా, అబ్దుల్ రషీద్ అంత్యక్రియలు బంధుమిత్రులు, సైన్యాధికారుల సమక్షంలో ముగిశాయి.

More Telugu News