: పవన్ కల్యాణ్ ఒక్కడికే ప్రశ్నించే హక్కు ఉందా?.. ఆయన గొప్పనటుడు కాకపోయినా ఒప్పుకోవాలా?: మహేశ్ కత్తి తీవ్ర విమర్శలు
ఇటీవలే 'బిగ్‌బాస్' షో నుంచి ఎలిమినేట్ అయిన సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అనంతరం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. దీనిపై పవన్ అభిమానుల నుంచి ఆయనకు బెదిరింపులు వస్తోన్న నేపథ్యంలో ఈ రోజు మీడియా ముందుకు వచ్చాడు. సమాజంలో పవన్ కల్యాణ్ కి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉందా? అని ఆయన అన్నారు. ఓ స్టార్‌గా ఆయనను తాను గౌరవిస్తానని, అయితే ఆయన ఓ గొప్పనటుడని తాము బలవంతంగా ఒప్పేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఆయన గొప్పనటుడు కాకపోయినా ఒప్పుకోవాలా? అని అడిగారు.
తమకు కూడా భావవ్యక్తీకరణ హక్కు ఉందని, ప్రశ్నించే హక్కు ఉందని మహేశ్ కత్తి చెప్పారు. పవన్ కల్యాణ్‌ని తాను ఎప్పుడూ కలవలేదని, భవిష్యత్తులో కలుస్తానో లేదో కూడా తెలియదని అన్నారు. తనకు, పవన్ కల్యాణ్‌కి మధ్య ఎటువంటి విభేదాలూ లేవని చెప్పారు. తన అభిప్రాయం తాను చెబితే ఆయన ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆయన గొప్పనటుడని ఒప్పుకోమని ఎందుకింత ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, పవన్ కల్యాణ్‌కి ఎటువంటి ప్రత్యేక హక్కులూ ఉండబోవని చెప్పారు. తాను ఫస్ట్ డే ఫస్ట్ షో అందరి సినిమాలు చూసినట్లే ఆయన సినిమాలు కూడా చూస్తానని అన్నారు. తనకు అందరు హీరోలూ ఎలాగో పవన్ కల్యాణ్ కూడా అలాగేనని అన్నారు. అలాగే ‘పవన్ కల్యాణ్ సమాజాన్ని బాగుపర్చడానికి వచ్చారా? మేమంతా, ఇతరులమంతా చేతగాని వాళ్లమా? అని ఆయన ప్రశ్నించారు.