: తిరుమల 'బాలాజీ'ని చూపించడం లేదని క్యాంపులో వున్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల గుర్రు!
గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎక్కడ బీజేపీ గూటిలో వాలిపోతారోనన్న భయంతో 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బెంగళూరుకు తీసుకొచ్చి శివారు ప్రాంతంలోని ఈగిల్టన్ రిసార్టులో ఉంచి సకల సౌకర్యాలనూ కల్పించిన సంగతి తెలిసిందే. ఇక వారిని తీసుకువచ్చే ముందు తిరుమలకు తీసుకెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయిస్తామని, కర్ణాటకలో ఫేమస్ అయిన కొడగు కొండలు చూపిస్తామని హామీ ఇచ్చారట.
అయితే, ఇంతవరకూ క్యాంప్ నిర్వాహకులు మాట నిలబెట్టుకోకపోవడంపై ఇప్పుడా ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తిరుమలకు ఎప్పుడు తీసుకెళతారని గట్టిగానే అడుగుతున్నారట. ఇంతదూరం వచ్చి పక్కనే ఉన్న తిరుమలకు వెళ్లి బాలాజీని దర్శించుకోకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారట. కర్ణాటక మంత్రిపై ఐటీ దాడులను చూసిన తరువాత కొంత ఆందోళనలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, తాము గుజరాత్ కు వెళ్లిపోతామని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.