: చంద్రబాబు.. ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్!: వైసీపీ ఎమ్మెల్యే రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఐదు సంతకాలు పెట్టారని తెలిపారు. 2014 జూన్‌లోనే బెల్టు షాపులు ఉండనివ్వమని సంతకం పెట్టిన చంద్రబాబు ఇన్నేళ్లయినా వాటిని అరికట్టలేకపోయారని ఆమె అన్నారు. ఆయన ఎంత అసమర్థుడో ఈ విషయంతోనే అర్థమవుతోందని చెప్పారు. చంద్రబాబుని ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్ అని అంతా అంటున్నారని రోజా ఎద్దేవా చేశారు.
ఏపీలో మహిళలు పోరాటం చేస్తున్నందుకు మళ్లీ ఇప్పుడు నెలరోజుల్లో బెల్టు షాపులను అరికడతామని మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. సంతకం పెట్టిన క్షణం నుంచి అమల్లోకి రావాల్సిన అంశాలు ఇప్పటికీ రావడం లేదని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాల్లో నాలుగు దిక్కులేకుండా పోయాయని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని అన్నారు. అప్పట్లో వైస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం కాగానే సంతకాలు చేసి, వాటిని వెంటనే సమర్థంగా అమలుపర్చారని చెప్పారు.
సీఎం సంతకాలకు చంద్రబాబు విలువ లేకుండా చేశారని రోజా మండిపడ్డారు. పింఛన్ల విషయంలో వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించుకున్నారని, ఎంతో మంది అర్హులైనవారికి ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం కుప్పంలోనూ పింఛన్లు ఇవ్వడం లేదని అన్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి ఇచ్చేవారని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట్లో ఒక్కరికే ఇస్తామని చెప్పి అది కూడా చేయడం లేదని మండిపడ్డారు. రూ.5 కే అన్నం పెడతామన్నారని, అది కూడా లేదని అన్నారు. దీన్ని బట్టే చంద్రబాబు ఎంత అసమర్థుడో పూర్తిగా అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధానికి ఎలా తూట్లు పొడిచారో అందరికీ తెలుసని అన్నారు.