Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెలవులు రద్దు చేసుకున్న అకున్ సబర్వాల్.. టాలీవుడ్ 'మత్తు'బాబులకు బిగుస్తున్న ఉచ్చు?

టాలీవుడ్ లో నెలకొన్న డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన 10 రోజుల వ్యక్తిగత సెలవును రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, అకున్ సబర్వాల్ సెలవుపై వెళుతుండటంపై నలు వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఆయన వెనక్కి తగ్గారు. వక్తిగత సెలవులను రద్దు చేసుకున్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన సెలవు వాయిదా వేసుకున్నారు.

డ్రగ్స్ కేసు తీవ్రత దృష్ట్యా ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. అకున్ సబర్వాల్ సెలవుపై వెళితే, ఆయన స్థానంలో ఈ కేసును ఎవరు డీల్ చేస్తారంటూ విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దీంతో, కాస్త ఇబ్బందికి గురైన ప్రభుత్వం ఆయన సెలవును రద్దు చేసినట్టు సమాచారం. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు 10 రోజుల పాటు అకున్ కు లీవ్ మంజూరైన విషయం తెలిసిందే. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉంది. ఈ నేపథ్యంలో, ఆయన సెలవుపై వెళితే కేసు నీరుగారిపోయే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

More Telugu News