: కేసీఆర్ రాచరిక పోకడలు మంచివి కావు: ప్రొఫెసర్ కోదండరామ్


సీఎం కేసీఆర్ రాచరిక పోకడలు పోవడం మంచిది కాదని తెలంగాణ జేఏసీ నేత, ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. హైదరాబాద్ మఖ్దూంభవన్ లో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, పలు సంఘాల నేతలు హాజరయ్యారు. కోదండరామ్ మాట్లాడుతూ, ధర్నా చౌక్ ఎత్తివేసిన తర్వాత ప్రగతి భవనే.. ధర్నాభవన్ గా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ విధానం సరిగా లేదని, సమస్యలపై చర్చించాల్సిన ప్రభుత్వం, పోలీసులతో అణచివేయిస్తోందని మండిపడ్డారు. ధర్నాచౌక్ మార్చడానికి గల కారణాలేంటో ప్రభుత్వం చెప్పలేకపోతోందని, ధర్నాచౌక్ ఎత్తి వేస్తే ప్రజల అసంతృప్తి పోతుందనుకోవడం ఒట్టి భ్రమేనని అన్నారు. ఈ సమస్యపై ప్రతిపక్షాలతో చర్చించి మెప్పించాలని, ఈ నెల 17న జరిగే సమావేశంలో మేధావులందరినీ ఏకం చేస్తామని తమ్మినేని తెలిపారు. కాగా, తమ డిమాండ్ల విషయమై సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తున్న తమ్మినేని సహా పలువురిని పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News