Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆకాశంలో పుట్టాడు.... బంపర్ ఆఫర్ కొట్టాడు!

ఆకాశంలో ఎగురుతున్న విమానంలో పుట్టిన పసిబిడ్డ బంపర్ ఆఫర్ పొందాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... సౌదీ అరేబియాలోని దమ్మమ్‌ నుంచి భారత్‌ లోని కొచ్చి వస్తున్న జెట్‌ ఎయిర్‌ వేస్‌ కి చెందిన 9 డబ్ల్యూ 569 విమానం 35 వేల అడుగుల ఎత్తులో ఉండగానే నిండుగర్భిణికి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఫ్లైట్ లో ఉన్న కేరళకు చెందిన నర్సు, విమాన సిబ్బంది కలసి సుఖ ప్రసవానికి సహాయపడ్డారు. ఆ తల్లి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో ఆకాశంలో ఆ ప్రయాణికుల మధ్యకు ప్రత్యేకమైన అతిథి వచ్చాడు. విమానాన్ని కొచ్చికి కాకుండా ముంబైకి మళ్లించి ల్యాండ్ చేశారు. తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించి, 90 నిమిషాలు ఆలస్యంగా వెళ్లి కొచ్చిలో ఇతర ప్రయాణికులను దించింది. జెట్ ఎయిర్ వేస్ సంస్థలో పుట్టిన తొలి బిడ్డ కావడంతో ఆ అనుకోని అతిథికి జీవితాంతం ఉచితంగా ప్రయాణ టికెట్లు ఇవ్వనున్నామని సంస్థ తెలిపింది. ఆ బిడ్డ ఎప్పుడు ఎక్కడికి ప్రయాణించినా ఫ్రీ టికెట్ ఇస్తామని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది.

More Telugu News