ప్రై'వేటు'తో వేల మంది ప్రయాణికులు రోడ్డునపడ్డారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రై'వేటు'తో వేల మంది ప్రయాణికులు రోడ్డునపడ్డారు!

ప్రైవేటు బస్సులపై తెలుగు రాష్ట్రాలు ఉక్కుపాదాన్ని మోపగా, ఎక్కడికక్కడ నిలిచిన దాదాపు 900 బస్సులతో వేలాది మంది ప్రయాణికులు నడిరోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో రిజిస్టరై, ఏపీలో ట్రావెల్స్ సంస్థల బస్సులుగా తిరుగుతున్న వాటిల్లో రోడ్లపైకి వచ్చిన బస్సులన్నింటినీ రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. పలు జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టిన అధికారులు వాటిని రోడ్లపైనే సీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 బస్సులను గమ్య స్థానాలకు చేరనీయకుండా రోడ్లపై నిలపడమేంటని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిలదీస్తే, రాష్ట్రంలో 900 బస్సులను నిలిపివేశామని, ఇంతమందికి ప్రయాణ ఏర్పాట్లను తాము చేయలేమని అధికారులు చేతులెత్తేయడం గమనార్హం. అనంతపురం, కర్నూలు, గుంటూరు, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఈ ప్రత్యేక తనిఖీలు జరిగాయి. పలు బస్సులు విక్రయించిన టికెట్లను ముందుగానే రద్దు చేసినప్పటికీ, ధైర్యం చేసి సుమారు 350కి పైగా బస్సులు రోడ్లపైకి వచ్చాయి. వీటన్నింటినీ సీజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు.

More Telugu News