: ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని వేధిస్తున్న యువకుడి అరెస్ట్!
అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిని ఈ రోజు విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ... సుభానీ అనే యువకుడు సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్ ద్వారా అందమైన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తాడని, ఆ తరువాత సదరు యువతులతో ప్రతిరోజు ఛాటింగ్ చేస్తూ మాయమాటలు చెబుతాడని చెప్పారు. ఆ తరువాత అమ్మాయిల వద్దకు నేరుగా వెళ్లి మాటలు కలుపుతాడని చెప్పారు. మెల్లిగా వారి ఫోన్ నెంబరు, ఫొటోలను తీసుకుని వేధింపులకు గురి చేస్తాడని పేర్కొన్నారు. ఆ యువకుడిని పట్టుకున్న ఓ యువతి బంధువులు నిందితుడికి దేహశుద్ధి చేసి, తమకు సమాచారం అందించారని అన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.