: ఇంటికా? జైలుకా?: హిమాచల్ సీఎం ముందస్తు బెయిల్ కొనసాగింపుకు సీబీఐ గట్టి అడ్డు!
అక్రమాస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, ఆయన సతీమణి నేడు పాటియాలా కోర్టు ముందు హాజరై, తమ ముందస్తు బెయిల్ ను కొనసాగించాలని పిటిషన్ పెట్టుకోగా, సీబీఐ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఓ రాష్ట్రానికి వీరభద్రసింగ్ అధినేత అని, ఆయనకు బెయిల్ ఇస్తే, దర్యాఫ్తు ప్రభావితమవుతుందని వాదిస్తోంది. 2009 నుంచి 2011 మధ్య వీరభద్రసింగ్, తన కుటుంబ సభ్యులతో కలసి రూ. 10 కోట్ల వరకూ అక్రమాస్తులు కూడబెట్టినట్టు సీబీఐ సెప్టెంబర్ 2015లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఈడీ విచారణను ఎదుర్కొన్న ఆయనకు దిగువ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకించిన సీబీఐ పాటియాలా కోర్టును ఆశ్రయించింది. యూపీఏ-2 ప్రభుత్వం సాగుతున్న వేళ, ఉక్కు శాఖను నిర్వహించిన వీరభద్రసింగ్, పలు కంపెనీలకు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చి, ఈ డబ్బు వెనకేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో ఇప్పటివరకూ రూ. 14 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయగా, నేడు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తేనే ఇంటికి వెళ్లనున్నారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తే, అరెస్ట్ చేసి జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కోర్టు చుట్టు పక్కలా, రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసివున్నారు. ప్రస్తుతం న్యాయమూర్తి వాదనలు వింటున్నారు. వీరభద్ర సింగ్ బెయిల్ పై మధ్యాహ్నం తరువాత తీర్పు వెలువడవచ్చని సమాచారం.