Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షీనాబోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి భార్య దారుణ హత్య

షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల్లో ముంబై పోలీసు అధికారి ధ్యానేశ్వర్ గనోరె ఒకరు. తాజాగా ఆయన భార్య దీపాలి గనోరె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నిన్న రాత్రి ఆమె ముంబైలోని శాంతాక్రజ్ లో దారుణ హత్యకు గురైంది. ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం... ఆమె మృతదేహం పక్కన కత్తి కనిపించడంతో... ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఖర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ధ్యానేశ్వర్ ఇంటికి వచ్చి తలుపు తట్టినా అతని భార్య ఎంతసేపటికీ తలుపు తీయలేదు. ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో, ఆయనకు అనుమానం వచ్చింది. ఎలాగోలా తలుపు తెరిచి, లోపలకు వెళ్లిన ఆయనకు... నేలపై రక్తపు మడుగులో పడిఉన్న భార్య కనిపించింది. దీంతో, వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు, వారి కుమారుడి ఆచూకీ కూడా ఇంతవరకు తెలియరాలేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News