Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ నాన్చుడు ధోరణి విరక్తి కలిగిస్తోంది.. నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు.. అభిమానులతో ట్విట్టర్ పోరు!

రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న మీమాంశలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సినీ నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. రజనీ నాన్చుడు ధోరణి విరక్తి కలిగిస్తోందని పేర్కొంది. ఐదేళ్లుగా అభిమానులను కలుసుకుంటున్న ఆయన యుద్ధం.. యుద్ధం అంటూ బోరో కొట్టిస్తున్నారని (పోర్.. పోర్.. రజనీ బోర్) వ్యాఖ్యానించింది. రాజకీయ అరంగేట్రానికి ధైర్యం కావాలని పేర్కొంది. రాజకీయ ప్రవేశంపై రజనీ ఏళ్ల తరబడి ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేసింది. ఈ మేరకు శనివారం ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేసింది.

కాగా, కస్తూరి వ్యాఖ్యలపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. ‘‘నీవు కూడా రజనీ గురించి మాట్లాడుతున్నావా?.. టైమ్.. ఏం చేస్తాం.. నోరు మూసుకో’’ అంటూ ఓ అభిమాని ఘాటుగా కౌంటరిచ్చాడు. దీనికి కస్తూరి కూడా అంతే ఘాటుగా స్పందించింది. ‘‘నీవు పుట్టక ముందు నుంచే నేను రజనీ అభిమానిని. నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్ల రజనీకి చెడ్డపేరు, అవమానం. ముందు నీ నోరు మూసుకో’’ అని చెంప చెళ్లుమనేలా బదులిచ్చింది. ‘‘సినిమాల్లో ఉండి రజనీని విమర్శిస్తావా.. ఎంత అమర్యాద!’’ అన్న మరో వీరాభిమాని కామెంట్‌కు కస్తూరి స్పందిస్తూ తాను చేసింది విమర్శలు కావని, విరక్తితోనే అలా అన్నానని, ఇదే అభిప్రాయం అందిరిలోనూ ఉందని, కాకపోతే తాను బయటపెట్టానని పేర్కొంది.

More Telugu News