: తల నరకబడిన జవాను ఇంట్లో యోగి ఆదిత్యనాథ్... ఏసీ, సోఫా వచ్చాయి, వెళ్లాయి!
ప్రేమ్ సాగర్... సరిహద్దులు దాటి వచ్చిన పాక్ సైనికులు అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తూ, హత్య చేసి తల నరకగా, అమరుడైన జవాను. ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించుకున్న వేళ, అధికారులు చేసిన నిర్వాకం ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టింది. బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం వస్తున్నారని తెలుసుకున్న అధికారులు, ఆగమేఘాల మీద జవాను ఇంట్లో ఓ ఏసీని తెచ్చిపెట్టారు. సోఫాలను అమర్చారు. కార్పెట్లు పరిచారు. కొత్త టవల్స్ తో అలంకరించారు.
అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆయన వెళ్లగానే తాము తెచ్చిన వాటిని అంతే వేగంగా సర్దేసుకుని తీసుకెళ్లిపోయారు అధికారులు. వీరి తమ ప్రవర్తనతో అమరజవాను కుటుంబాన్ని అవమానించారని, ఆ వస్తువులు తామేమీ తీసుకునేవారిమి కాదని సైన్యంలోనే పని చేస్తున్న ప్రేమ్ సాగర్ సోదరుడు దయాశంకర్ వ్యాఖ్యానించారు. కాగా, జవాను కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఈ సందర్భంగా యోగి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.