: ఆ విషయాన్ని రాజమౌళి మరోమారు నిరూపించారు: దర్శకుడు కృష్ణవంశీ
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తన ‘నక్షత్రం’ చిత్రం ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే, వెయ్యి కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తున్న ‘బాహుబలి-2’ చిత్రం గురించి ఆయన స్పందిస్తూ.. ఏ సినిమా అయినా, దానికి సంబంధించిన క్రెడిట్ అంతా ముఖ్యంగా దర్శకుడికే చెందుతుందని, సినిమా అంటేనే దర్శకుడని, ఆ విషయాన్ని రాజమౌళి మరోమారు నిరూపించారని అన్నారు. అయితే, బడ్జెట్ అనేది సినిమాకు ఎప్పుడూ అడ్డంకి కాకూడదని, సినిమా భవితవ్యాన్ని నిర్దేశించకూడదని అన్నారు. బడ్జెట్ గురించి భయపడితే ‘బాహుబలి’ సినిమా వచ్చేది కాదన్నారు. ఇక, తన సినిమాల గురించి చెప్పాలంటే, ఏదో సాధించాలని, పేరు రావాలని తానెప్పుడూ సినిమాలు చేయనని, తాను నమ్మిన ఆలోచనను తెరపైకి తీసుకురావాలని అనుకుంటానని చెప్పారు.