పన్నీరు సెల్వమా? మజాకా?...శశికళకు తగ్గా జవాబు ఇచ్చిన పన్నీరు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పన్నీరు సెల్వమా? మజాకా?...శశికళకు తగ్గా జవాబు ఇచ్చిన పన్నీరు!

తమిళనాడులో గత రెండు రోజుల నుంచి చోటుచేసుకున్న పరిణామాలు, తాజాగా పన్నీరు సెల్వం వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో జయలలిత మరణానంతర పరిణామాలను తమిళవాసులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. జయలలిత మరణానంతరం ఆమెకు నమ్మిన బంటుగా ఉన్న పన్నీరు సెల్వం చిన్నమ్మ (శశికళ) కు మద్దతు ప్రకటించారు. అమ్మ దగ్గర ఉన్నట్టే చిన్నమ్మ దగ్గర కూడా ఉన్నారు. అమ్మకు మొక్కినట్టే చిన్నమ్మకు కూడా వంగవంగి సలాము చేశారు. దీంతో తన పదవికి ఎలాంటి ప్రమాదం రాదని భావించారు. అయితే ఆయన ఊహించని విధంగా శశికళ నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. తన చుట్టూ పన్నీరు సెల్వం లాంటి అమ్మ విధేయులు ఉండకూడదని భావించారు.

 పార్టీ, పదవి తన గుప్పిట్లోనే ఉండాలని భావించారు. దీంతో పన్నీరు సెల్వంతో పాటు అంతవరకు ఆమెకు విధేయత చూపిన కొంత మంది... అమ్మ స్నేహితురాలిగా ఉంటూ, ఆమె స్థానాన్ని కబళించే ప్రయత్నం చేస్తున్న శశికళలోని అధికార కాంక్షను గుర్తించారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సమావేశం నుంచి నేరుగా అమ్మ సమాధి వద్దకు చేరుకుని మౌనదీక్షతో తిరుగుబాటును శశికళకు రుచిచూపించి మొదటి షాక్ ఇచ్చారు. అనంతరం జైలు శిక్ష పడడంతో శశికళకు ఊహించినదే అయినా రెండో షాక్ తగిలింది. అయినప్పటికీ దిగిరాని శశికళ...జయలలిత వెళ్లగొట్టిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, వారికే పార్టీ పెత్తనాన్ని కూడా అప్పగించారు. అంతే కాకుండా పన్నీరు సెల్వం నమ్మకద్రోహి అని, పదవి కోసం పాకులాడే వ్యక్తి అని ప్రచారం చేశారు. పార్టీ నేతలతో ప్రచారం చేయించారు.

ఈ పరిణామాలన్నింటినీ పన్నీరు సెల్వం చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. విమర్శలు చేసినా సహించారు. శాపనార్థాలు పెట్టినా భరించారు. ఆఖరుకు శశికళ జైలు కెళ్తూ జయలలిత సమాధి సాక్షిగా శపథం చేసిన సంగతి తెలిసిందే. దానిపై వివిధ కథనాలు వచ్చినప్పటికీ, ఆ శపథం పన్నీరు సెల్వం వంటి వారిపైనే అంటూ కూడా కథనాలు వెలువడ్డాయి. అనంతరం శశికళ జైలుకెళ్లారు. ఆర్కేనగర్ ఉపఎన్నికలు లక్ష్యంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించారు. అన్నాడీఎంకే (శశికళ వర్గం) డబ్బులు వెదజల్లితే... అన్నాడీఎంకే (పన్నీరు సెల్వం వర్గం) అమ్మ పేరుతో ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు వీరికి వచ్చే ఓట్లపై జయలలిత మేనకోడలు దీప కూడా ఆధారపడింది. దీంతో డీఎంకే లబ్ధి పొందుతుందని, విజయం కూడా ఆ పార్టీదేనని అంచనాలు వెలువడ్డాయి.

ఈ సమయంలో విజయం ఎలాగైనా దక్కించుకోవాలని భావించిన శశికళ వర్గం డబ్బులు పంచడంలో మరింత ఉత్సాహం చూపింది. ఇదే ఆ పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్ కొంప ముంచాయి. దీంతో ఆయన అరెస్టు అనివార్యమైంది. దీంతో పన్నీరు సెల్వం వర్గంతో చర్చలకు పళనిస్వామి వర్గం ముందడుగు వేసింది. చర్చలు సజావుగా సాగాయి. ఈ చర్చల్లో షరతులు కూడా ఎలా ఉండనున్నాయో వార్తలు వెలువడ్డాయి. అంతా పూర్తయిన అనంతరం పన్నీరు సెల్వం...నొరు విప్పారు. పార్టీకి తనను దూరం చేసిన సమయంలో తనను శశికళ ఏ రకమైన విమర్శలు చేస్తూ నోరుపారేసుకున్నారో....పన్నీరు సెల్వం కూడా అవే విమర్శలు చేశారు. అచ్చం అలాంటి (అవే) పదాలే ఉపయోగించారు. తనను ఏఏ మాటలు అన్నారో పన్నీరు సెల్వం కూడా ఆమెను అవే మాటలన్నారు. దీంతో పన్నీరు సెల్వమా? మజాకా? అని తమిళ ప్రజలు పేర్కొంటున్నారు. 

More Telugu News