: రాంగోపాల్ వర్మలో ఇంత మార్పుకు కారణం బాలీవుడ్ యువ హీరోనా?
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత రెండు రోజులుగా ప్రముఖులకు క్షమాపణలు చెబుతున్నాడు. గతంలో అర్థం పర్థం లేని ట్వీట్లతో వార్తల్లో నిలిచేందుకు ఎడాపెడా ట్వీట్లు చేసిన వర్మలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అసలు దేవుళ్లు, సినీ నటులు, సామాజిక అంశాలు, అభిమానులు, దేశ విదేశాల నేతల ఇలా ఒకటేమిటి... ప్రతి అంశంలోనూ ట్వీట్లు చేయడం.. తద్వారా కేసులు నెత్తిమీద వేసుకోవడం రాంగోపాల్ వర్మకు సర్వసాధారణంగా మారింది.
అయితే గత రెండు రోజులుగా వర్మ క్షమాపణలు చెబుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే... ఈ మధ్యన తను తీసిన రంగీలా సినిమాలో నటించిన జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ను బాలీవుడ్ వర్థమాన నటుడు విద్యుత్ జమ్వాల్ తో పోల్చుతూ పలు ట్వీట్లు చేశాడు. 'కమాండో' సినిమాతో మంచి బాడీ కలిగిన హీరోగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న విద్యుత్ జమ్వాల్ ను వర్మ కించపరిచాడు. దీనిపై నొచ్చుకున్న విద్యుత్ జమ్వాల్... రాంగోపాల్ వర్మకు ఫోన్ చేసి, తానెవరో, తానేంటో మీకు తెలియదని, అలాంటప్పుడు తనను కించపరచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు.
అంతే కాకుండా టైగర్ ష్రాఫ్ ను పొగడాలనుకున్నప్పుడు నేరుగా అతనినే పొగడాలని, అలా కాకుండా అతనిని పొగిడేందుకు తనను కించపరచాల్సిన అవసరం ఏంటని నిలదీశాడు. ఈ విధానం సరైనది కాదని సూచించాడు. దీంతో వర్మకు చేసిన తప్పు అర్ధమైంది. దీంతో అతనికి క్షమాపణలు చెప్పాడు. ఈ సంభాషణను విద్యుత్ జమ్వాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసి, వర్మ క్షమాపణ చెప్పాడంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత గతంలో తను చేసిన విమర్శల వల్ల నొచ్చుకున్న వారందరికీ క్షమాపణలు చెబుతున్నాడు. అయితే వర్మలో నిజంగానే జ్ఞానోదయం అయిందా? అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమని పలువురు కామెంట్లు చేస్తున్నారు.