: పదవి రాకుంటే బాధ సహజమే కదా?: కళా వెంకట్రావు
మంత్రి పదవులు ఆశించిన వారు, పదవి రాకుంటే బాధ పడటం, దాన్ని ఏదో ఓ విధంగా వ్యక్తం చేయడం సర్వ సాధారణమేనని, 30 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ తరహా పరిస్థితిని ఎన్నోమార్లు ఎదుర్కొందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, కొత్త మంత్రి కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల రాజీనామా ఆలోచనలు, టీ కప్పులో తుపాను వంటిదేనని, పరిస్థితులు నేడో, రేపో చక్కబడతాయని అన్నారు. పదవులు ఇవ్వలేనివారిని మరో విధంగా ఆదుకుంటామని తెలిపారు. తాము మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున, పార్టీ అధ్యక్ష పదవి విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఆయన అభీష్టం మేరకు నడుచుకుంటానని కళా వెంకట్రావు వెల్లడించారు.